మాస్కో: రష్యా తన అత్యాధునిక ఒరెష్నిక్ క్షిపణి(Oreshnik Missile)ని ప్రయోగించింది. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి ఆ క్షిపణి పేరుగాంచింది. ధ్వని వేగం కన్నా వేగంగా అది వెళ్తుంది. హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్‌గా దీన్ని పిలుస్తున్నారు. ఉక్రెయిన్‌లోని లెవివ్ నగరంలో ఉన్న డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలను ఆ క్షిపణితో టార్గెట్ చేశారు. మిలిటరీ కేంద్రాలను కూడా ఆ మిస్సైల్‌తో పేల్చి వేసినట్లు సమాచారం ఉన్నది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై ఇటీవల ఉక్రెయిన్ తన డ్రోన్లతో అటాక్ చేసిన విషయం తెలిసిందే. నొవోగొరాడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ ఇంటిపై డ్రోన్ అటాక్ జరిగిన ఘటనకు ప్రతీకారంగా రష్యా తన ఆయుధునిక క్షిపణికి పనిపెట్టనట్లు రక్షణశాఖ పేర్కొన్నది. డిసెంబర్ 28 రాత్రి సుమారు 91 సుదీర్ఘ దూరం ప్రయాణించే డ్రోన్లను పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ వదిలింది. అయితే ఆ డ్రోన్లను అన్నింటినీ మాస్కో కూల్చివేసింది.
లివివ్ ప్రాంతంలో ఒరెష్నిక్ క్షిపణితో దాడి చేసిన ఘటనకు చెందిన ఓ వీడియో వైరల్ అయ్యింది. పోలాండ్ బోర్డర్ సమీపంలో ఆ మిస్సైల్ పేలింది. అయితే ఆ క్షిపణి ప్రయోగించిన సమయంలో అనేక ప్రొజెక్టైల్స్ రిలీజ్ అవుతుంటాయి. అవన్నీ ఆ వీడియోలో కనిపించాయి. లివివ్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అండర్‌గ్రౌండ్ గ్యాస్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఒరెష్నిక్ క్షిపణి పేల్చి ఉంటుందని భావిస్తున్నారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఆ బాలిస్టిక్ క్షిపణిని రష్యా రెండో సారి వినియోగించింది. 2024 నవంబర్‌లో ఉక్రెయిన్‌లోని డీప్నర్ సిటీపై దాన్ని వాడింది. 2025 చివరలో బెలారస్‌పై కూడా రష్యా ఆ క్షిపణిని వాడినట్లు తెలుస్తోంది.
ఒరెష్నిక్ క్షిపణిని తోకచుక్కతో పోల్చారు పుతిన్. మల్టిపుల్ టార్గెట్లను పేల్చగల వార్‌హెడ్స్‌ను అది ఒకేసారి మోసుకెళ్తుందని ఆయన గతంలో పేర్కొన్నారు. ధ్వని వేగం కన్నా పది రెట్ల అధిక వేగంతో ఆ క్షిపణి ప్రయాణిస్తుంది. ఆ క్షిపణి టార్గెట్‌లో ఉన్న ప్రదేశం దుమ్ముదుమ్ము అవుతుందన్నారు. ఒరెష్నిక్ను ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణిగా పిలుస్తారు. ఇది 5500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. తాజాగా రష్యా తన ఒరెష్నిక్ మిస్సైల్‌తో పాటు 13 ఇతర బాలిస్టిక్ క్షిపణులను తమపై రిలీజ్ చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. వీటితో పాటు మరో 22 క్రూయిజ్ మిస్సైళ్లు, 242 డ్రోన్లను కూడా రష్యా వదిలినట్లు ఆయన చెప్పారు.