హైదరాబాద్ ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్ రాయ్‌దుర్గ్ 83/1 సర్వేనంబర్‌లోని జామియా నిజామియా వక్ఫ్ భూముల వేలాన్ని అడ్డుకుంటామని ముస్లిం మైనారిటీ సంస్థలు వెల్లడించాయి. వేలంపై మొండిగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ వైఖరికి నిరసనగా పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ సమాలోచనలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మైనారిటీ నేత ఎంఏ హకీమ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జమాత్-ఏ- ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్, తహ్రీక్ ముస్లిం షబాన్ అధ్యక్షుడు ముస్తాక్ మాలిక్, మౌలనా జాఫర్‌పాషా సానీ శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
జామియా నిజామియా భూముల వేలాన్ని అడ్డుకునేందుకు చట్టపరమైన అంశాలు, ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ వక్ఫ్ భూముల పరిరక్షణకు ముస్లింలందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ముందుగా న్యాయపోరాటం చే యాలని నిర్ణయించామని వెల్లడించారు. రా య్దుర్గ్లోని భూమి వక్ఫ్ ఆస్తి అని నిర్ధారిం చే పత్రాలు ఉన్నాయని వివరించారు. వక్ఫ్ నామా రిజిస్టర్ ఉన్నదని, 1990లో కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఈ భూ మిని వక్ఫ్ ఆస్తిగా గుర్తించిందని గుర్తుచేశారు. త్వరలోనే మరోసారి సమావేశమై కార్యాచరణను ప్రకటిస్తామని, ప్రభుత్వం వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.