Muscle Loss | దశాబ్దాలుగా వృద్ధాప్యం, కదలిక సామర్థ్యం, ఎముకలు విరిగే ప్రమాదాలపై జరిగిన చర్చల్లో ఎముకల ఆరోగ్యం ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. సాధారణంగా ఏర్పడే బోన్ మినరల్ డెన్సిటీ (BMD) స్కాన్ల నుంచి ఆస్టియోపోరోసిస్‌పై విస్తృత అవగాహన వరకు ప్రధాన దృష్టి ఎముకల బలాన్ని కాపాడటంపైనే నిలిచింది. అయితే తాజా పరిశోధనలు ఈ దృక్పథం పూర్తిగా సరిపోదని సూచిస్తున్నాయి. ఇప్పుడు నిపుణులు తరచూ నిర్లక్ష్యానికి గురయ్యే మరో అంశంపై దృష్టి సారిస్తున్నారు. వయస్సు పెరగడం వల్ల క్రమంగా కండరాల పరిమాణం, బలం తగ్గిపోవడం అనే అంశంపై వారు దృష్టిసారించారు. దీన్నే సార్కోపీనియాగా పిలుస్తున్నారు. దీని వల్ల అంగవైకల్యం, శస్త్రచికిత్స లోపాలు, మెటబాలిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతోందని, దీని ప్రభావాలు దీర్ఘకాలం పాటు ఉంటాయని అంటున్నారు. సమతుల్యత నుంచి కదలిక వరకు, పెద్ద శస్త్రచికిత్సల తర్వాత కోలుకునే సామర్థ్యం వరకు అన్నింటినీ ఇది ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
ఆర్థోపెడిక్ నిపుణులు ఎముకలు, కండరాలు ఒకే వ్యవస్థగా పనిచేస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఎముకల సమస్యలను మాత్రమే చికిత్స చేయడం, కండరాల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల కోలుకునే ప్రక్రియ పరిమితం అవుతుందని, సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, కూర్చునే జీవనశైలి సాధారణమవుతుండగా, కండరాల నష్టాన్ని ప్రారంభ దశలోనే ఎదుర్కోవడం స్వతంత్ర జీవనాన్ని కాపాడటానికి, పడిపోవడం నివారించడానికి, మొత్తం జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి అత్యంత సమర్థవంతమైన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కండరాల నష్టం ఎందుకు పెరుగుతున్న సమస్యగా మారుతోంది అనే అంశంపై ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ శువేందు ప్రసాద్ రాయ్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ సంరక్షణలో తాము సంప్రదాయంగా బ్రిక్స్.. అంటే ఎముకలు, సంధులపై దృష్టి పెట్టామని, ఆస్టియోపోరోసిస్‌ను నివారించేందుకు బోన్ మినరల్ డెన్సిటీని క్రమంగా పరిశీలిస్తూనే ఉన్నామని తెలిపారు. కానీ మార్టర్.. అంటే కండరాల వ్యవస్థను తరచూ నిర్లక్ష్యం చేస్తున్నామని అన్నారు.
సార్కోపీనియా అత్యంత ముఖ్యమైన వ్యాధి అని, కానీ పట్టించుకోని అంశంగా మారిందని తెలిపారు. ఇది శస్త్రచికిత్స ఫలితాలు, దీర్ఘకాలిక వైకల్యతను ముందుగా సూచించే సూచిక అని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం వయస్సుతో వచ్చే కండరాల క్షీణత వృద్ధుల్లో బలహీనతకు, స్వతంత్ర జీవన నష్టానికి ప్రధాన కారణంగా నిలుస్తుందన్నారు. అధ్యయనాలు చెబుతున్నట్లుగా 30 ఏళ్ల తర్వాత ప్రతి దశాబ్దంలో 3 నుంచి 8 శాతం వరకు కండరాల పరిమాణం తగ్గుతుందని తెలిపారు. 60 ఏళ్ల తర్వాత ఈ తగ్గుదల మరింత వేగంగా జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న అవగాహన ప్రకారం ఆస్టియోపోరోసిస్, సార్కోపీనియా ఒకేసారి జరుగుతాయని, పరస్పరం ప్రభావితం చేస్తాయని తెలిపారు. కండరాలు ఎముకల బలాన్ని కాపాడడంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయని, కండరాలు ఎముకలకు అంటి ఉంటాయి కాబట్టి కండరాల బలం, వాటి క్రమమైన సంకోచం ఎముకలకు బలం, సాంద్రతను నిలుపుకోవడానికి నేరుగా ప్రేరణ ఇస్తుందని ఆయన వివరించారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం కండరాల పరిమాణం తగ్గడం ఎముకల సాంద్రత తగ్గడంతో దగ్గర సంబంధం కలిగి ఉందని తేలింది. ఇది ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రెండు పరిస్థితులు కలిసినప్పుడు దాన్ని ఆస్టియోసార్కోపీనియాగా పిలుస్తారు. ఎముకల ఆరోగ్యం ముఖ్యమైనదే అయినా శారీరక స్వతంత్రతకు కండరాలే ప్రధాన శక్తి యంత్రం అని డాక్టర్ రాయ్ చెప్పారు. కండరాల నాణ్యత తగ్గిపోవడం, ముఖ్యంగా వాటిలో కొవ్వు చేరడం వల్ల, సంధుల స్థిరత్వం తగ్గి కార్టిలేజ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆస్టియోఆర్థ్రైటిస్ వంటి సమస్యలను వేగవంతం చేస్తుంది. యూరోపియన్ వర్కింగ్ గ్రూప్ ఆన్ సార్కోపీనియా ఇన్ ఓల్డర్ పీపుల్ ప్రకారం సార్కోపీనియాను కేవలం కండరాల పరిమాణంతో మాత్రమే కాకుండా, బలం, పనితీరు తగ్గుదలతో కూడా నిర్వచిస్తారు. ఇవే వైకల్యానికి బలమైన సూచికలు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పెద్దలు వారానికి కనీసం రెండు రోజులపాటు కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాలి. సరైన పోషణ, తగిన ప్రోటీన్, విటమిన్ డి తీసుకోవడం కండరాల ప్రోటీన్ సంశ్లేషణకు అత్యంత కీలకం. ముఖ్యంగా వృద్ధుల్లో సరిపడా ప్రోటీన్ తీసుకోవడం కండరాల నష్టాన్ని తగ్గించి బలాన్ని పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కండరాల నష్టం ఇక వృద్ధాప్యానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. ఇది కదలిక, స్వతంత్ర జీవనం, దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలపై ప్రభావం చూపే ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగా ఎముకల ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెట్టడం ఫ్రాక్చర్లను నివారించడానికి లేదా శస్త్రచికిత్సల తర్వాత విజయవంతమైన జీవితానికి సరిపోదు. సార్కోపీనియాను ప్రారంభ దశలోనే గుర్తించి శక్తి వ్యాయామాలు, సరైన పోషణ, క్రమమైన అంచనాలను ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వ్యక్తులు పడిపోవడం, ఎముకలు విరగడం, మెటబాలిక్ సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. కండరాల ఆరోగ్యాన్ని ఎముకల సాంద్రతతో సమానమైన క్లినికల్ ప్రాముఖ్యతగా భావిస్తే కేవలం శరీర నిర్మాణాన్ని మరమ్మత్తు చేయడం మాత్రమే కాదు, దాన్ని కదిలించే శక్తిని కూడా సంరక్షిస్తున్నట్లే అని డాక్టర్ రాయ్ తేల్చి చెప్పారు.