
మద్దూరు/ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎయిర్‌గన్‌తో కాల్చి స్నేహితుడినే హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఈ నెల 3న అర్ధరాత్రి చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన మహ్మద్ మన్సూర్ అమెరికాలో ఉంటుండగా, అతని ఇంటిని ఫైజల్ చూసుకుంటున్నాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌కు చెందిన మహ్మద్ ముసాహిబ్ (20) గత నెల 31న టూర్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన స్నేహితులు సయ్యద్ మహ్మద్జైన్, సయ్యద్ సల్మాన్, అతిఫ్అతినాస్, మహ్మద్సాదుద్దీన్, మహ్మద్‌సలీం, జిషాన్ నవీత్తో కలిసి సలాఖపూర్కు వచ్చాడు. ఫైజల్ ఆధీనంలో ఉన్న ఇంట్లో వీరందరు మూడ్రోజులు బస చేశా రు. వీరికి గ్రామానికి చెందిన మహ్మద్ సత్తార్ సహాయకుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న రాత్రి ఏడుగురు కలిసి ఎయిర్‌గన్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో ముసాహిబ్ తలపై సత్తార్ గన్‌పెట్టి పేల్చాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని హుటాహుటిన చేర్యాల దవాఖానకు తరలించగా, వైద్యుల సూచనతో సిద్దిపేటకు తరలించారు. కానీ అప్పటికే ముసాహిబ్ మృతిచెందాడు. మృతుని తండ్రి షేక్ అయ్యుబ్పాషా ఫిర్యాదుతో పోలీసులు సత్తార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫామ్‌హౌస్‌లు, వ్యవసాయక్షేత్రాల్లో జంతువులను, పక్షులను భయపెట్టేందుకు ఎయిర్గన్స్ను వాడుతారు. కొందరు తమ వద్ద గన్ ఉందని చూపించటం కోసం దీన్ని వాడుతున్నారు. అడవుల్లోకి వెళ్లి జంతువులను వేటాడేవాళ్లూ ఉన్నారు. హైదరాబాద్‌లోని టోలిచౌక్, లంగర్‌హౌస్, మెహిదీపట్నం, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, బంజారాహిల్స్‌లో నివాసముండే చాలామంది ఎయిర్గన్స్ను సమకూర్చుకుంటున్నారు. గత నెల చివర్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కృష్ణ జింకలను వేటాడుతుండగా బంజారాహిల్స్‌కు చెందిన ముగ్గురిని కర్ణాటక ఆటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎయిర్‌గన్‌తో దగ్గరగా కాల్చితే ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా, కొందరు అలాంటి పనులకు పాల్పడుతున్నారు. తాజా ఘటనే దానికి నిదర్శనం. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటే ఎయిర్‌గన్స్ వాడకంపై పోలీసుల నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.