Gujarat | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ర్టాలకు మాడల్ అని బీజేపీ నేతలు పదేపదే గప్పాలు కొట్టుకొనే గుజరాత్లో చీకట్లు అలముకొన్నాయి. వీధి దీపాల బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కమ్‌లు) పలు మున్సిపాలిటీలు, గ్రామాలకు కరెంట్ నిలిపివేశాయి. దీంతో వీధి దీపాలు వెలుగకపోవడంతో గుజరాత్ పట్టణాలు, గ్రామాలు గత నెల రోజులుగా అంధకారంలో మగ్గిపోతున్నాయి. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని 35 మున్సిపాలిటీలు ఈ ఏడాది జనవరి 31 వరకు రూ.82 కోట్ల మేర బకాయిలు పడ్డాయని గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది. విద్యుత్తు సరఫరా నిలిపివేసిన మున్సిపాలిటీలలో గోద్రా, బాలాసినోర్, బోర్సాద్ తదితర పట్టణాలు ఉన్నాయి. బకాయిలు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తామని డిస్కమ్‌లు చెబుతుండటంతో స్థానిక సంస్థల అధికారులు తలలు పట్టుకొంటున్నారు.
నీటి సరఫరా మోటర్లకూ కట్
దక్షిణ గుజరాత్లో భరూచ్, నర్మదా జిల్లాలోని చాలా గ్రామాల పంచాయతీలు వీధి దీపాల బిల్లులు చెల్లించకపోవడంతో డీజీవీసీఎల్ విద్యుత్తు సరఫరా నిలిపివేసింది. పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ కూడా కచ్ జిల్లాలోని పలు గ్రామాల్లో వీధి దీపాల కనెక్షన్లు కట్ చేసింది. భుజ్, మోర్బి, అంజర్తో సహా సుమారు 20 మున్సిపాలిటీలకు నీటి సరఫరా చేసే మోటార్లకు విద్యుత్తు నిలిచిపోయింది. మరోవైపు ఉత్తర గుజరాత్లో ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (యుజివీసీఎల్)కు ఈ ఏడాది జనవరి 31 వరకు పలు మున్సిపాలిటీలు రూ.58.75 కోట్ల విద్యుత్తు బిల్లులు బకాయి పడ్డాయి.
పారిశ్రామిక ప్రాంతాల్లో కోతలు
పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా రోజూ పదేపదే విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతల వల్ల నష్టపోతున్నామని, కూలీ కూడా గిట్టుబాటు కావటం లేదని సూరత్‌లోని సయాన్ ప్రాంతంలో నేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు నిరసనలు తెలుపడంతో గుజరాత్ పవర్ కంపెనీ లిమిటెడ్ అధికారులు దిగివచ్చి, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.