మేడ్చల్, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 68 వార్డులకు పోటీ జరుగుతుండగా 68 వార్డులకు గాను 136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 65,863, 136 పోలింగ్ కేంద్రాల్లో 818 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లను, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించారు.
అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 20,451 ఓటర్లు ఉండగా పురుషులు 10,336, మహిళలు 10,115 ..ఎల్లంపేట్ మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 22,581 ఓటర్లు ఉండగా పురుషులు 11,285, మహిళలు11,296… మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 22,831 ఓటర్లకు గాను పురుషులు 11,430, మహిళలు 11,401 ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, సిబ్బందిని అధికారులు తరలిస్తున్నారు. కేంద్రాలను ఎన్నికల పరిశీలకురాలు నిర్మల కాంతి వెస్లీతో కలిసి కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. సామగ్రి, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు నిర్ణిత సమయంలో చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.