హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను యథావిధిగా కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘ఎంఎస్ఎంఈ-సమ్మిళిత అభివృద్ధి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘ప్రభుత్వాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్, కానీ అభివృద్ధి ఆగకూడదు.. పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా గత సర్కారు ప్రవేశపెట్టిన వివిధ పాలసీలను కొనసాగిస్తాం’అని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంఎస్ఎంఈ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు, దీంతో దేశంలోనే మొదటి ఎంఎస్ఎంఈ పాలసీ తెచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ రూపకల్పన జరుగుతున్నదని, దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలను కోరారు. పరిశ్రమకు నైపుణ్యంగల ఉద్యోగుల అవసరం ఎంతో ఉందని, ఇందుకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే ఐఎస్బీ తరహాలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.