హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌లోని తమ సంస్థను రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నది. రక్షణరంగం సైనిక విమానాలకు ఉపయోగించే టైర్లను ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఎంఆర్ఎఫ్ నిర్ణయించింది. దీనికోసం కంపెనీలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మమ్మెన్ గురువారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే.తారకరామారావుతో సమావేశమై కంపెనీ విస్తరణపై చర్చించారు.
పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ఎంఆర్ఎఫ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఎఫ్ విస్తరణ వివరాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్న నేపథ్యంలో సైనిక విమానాలకు అవసరమైన టైర్లను ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు ఎంఆర్ఎఫ్ సంస్థ ముందుకురావడం విశేషమని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక విమానయాన, రక్షణరంగ ఉత్పత్తులు ఇక్కడ తయారవుతున్నందున ఎంఆర్ఎఫ్ ప్రతిపాదిత విస్తరణ ప్లాంటు వీటికి అనుబంధంగా మారే అవకాశమున్నది.
ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా హెలికాప్టర్ క్యాబిన్లు, విమాన రెక్కల తయారీ, విమానాల తయారీకి అవసరమైన వివిధ పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో గడచిన ఏడేండ్లలో పలు దేశీయ, విదేశీ ఏరోస్పేస్ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన విషయం విదితమే. బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, సఫ్రాన్, రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్ తదితర ప్రముఖ గ్లోబల్ ఏరోస్పేస్ ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీ(ఓఈఎం) సంస్థలు ఇందులో ఉన్నాయి. ఇవికాకుండా టాటా, అదానీ గ్రూపు, కల్యాణి గ్రూపు వంటి ప్రముఖ భారతీయ ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థలు కూడా పరిశ్రమలను ఏర్పాటుచేశాయి. వీటికి అనుబంధ పరికరాల తయారీ కోసం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యాయి. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఏరోస్పేస్, రక్షణ పారును ఏర్పాటుచేసింది.
మన ఊరు-మన బడికి ఎంఆర్ఎఫ్ 4కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమానికి రూ. 4కోట్లు అందించనున్నట్లు ఎంఆర్ఎఫ్ ఎండీ ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌తో సమావేశం సందర్భంగా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ తాము సైతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ(సీఎస్ఆర్) కింద రూ. నాలుగు కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.