పుడమికి పచ్చలహారం వేస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు. తాజాగా ముంబై బాంద్రా వెస్ట్‌లో జరిగిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో సంగీత సామ్రాట్, పద్మవిభూషణ్ ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ కుటుంబ సభ్యులు, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే, ప్రముఖ గాయకులు హరిహరణ్, షాన్ పాల్గొన్నారు. తమ వంతుగా మొక్కలు నాటారు. ముంబైలో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లో ‘ధర్మపురి’ చిత్రబృందం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ చేశారు. జుబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో హీరో గగన్ విహారి, హీరోయిన్ అపర్ణదేవి, నిర్మాత భాస్కర్ యాదవ్ మొక్కలు నాటారు. ప్రకృతి సంపద పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.