ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 30: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్ తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) డిమాండ్ చేసింది. ఎంపీ వ్యాఖ్యలపై ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అంసా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. పసుపు బోర్డును తీసుకొస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి.. మాటతప్పిన ఎంపీ వైఖరిని నిరసిస్తూ రైతులు ఈనెల 24న నిలదీస్తే.. దానిని కమిషనర్ నాగరాజు చేయించాడని ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఆయన కమిషనరా లేక కానిస్టేబులా అంటూ కించపరిచేలా వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడైన సీపీ పట్ల చేసిన వ్యాఖ్యలు బీజేపీకి దళితులంటే ఎంత చులకనభావం ఉందో స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీజేపీని బొందపెట్టి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు లింగస్వామి, ప్రభాకర్, రాహుల్, రవి తదితరులు పాల్గొన్నారు.