యూలిప్ పాలసీలు చాలావరకు మెచ్యూరిటీ దశకు వచ్చేశాయి. పదేండ్ల క్రితం ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్‌ల సమ్మేళనంగా వచ్చిన ఈ పాలసీలు చాలాకాలం తర్వాత కాస్త లాభాలను చూపిస్తున్నాయి. అయితే చెల్లించిన ప్రీమియంల మీద పన్ను రాయితీలున్నట్టుగా, మెచ్యూరిటీ మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుందా?.. అనే విషయంలో అనేక సందేహాలున్నాయి. నిజానికి యూలిప్ పాలసీలు కూడా జీవిత బీమా పాలసీలే. మెచ్యూరిటీలపైనా పన్ను మినహాయింపుంటుంది. అయినప్పటికీ 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకున్న పాలసీలకు చెల్లించిన ప్రీమియం.. బీమా మొత్తంలో 10 శాతానికి మించకూడదు. అలాగే 2003 నుంచి 2011 మధ్య తీసుకున్న పాలసీల మొత్తం ప్రీమియం చెల్లింపులు 20 శాతం మించి ఉండకూడదు. యూలిప్ పాలసీ గడువు తర్వాత చేతికందిన మొత్తం సాధారణంగా ట్యాక్స్ ఫ్రీ. అయితే ఫిబ్రవరి 2021 నుంచి తీసుకున్న యూలిప్ పాలసీలపై నిబంధనలు మరోలా ఉన్నాయి. ఈ పాలసీలను మదుపుగా పరిగణిస్తున్నందున వచ్చిన లాభాలను క్యాపిటల్ గెయిన్స్‌గా చూస్తారు. అయితే దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను అందిస్తున్నారు. మూడేండ్లకుపైగా ప్రీమియం చెల్లిస్తేనే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.