ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవైన పటాన్చెరులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. దేశంలోని అనేక రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పని చేసేందుకు కార్మికులను కాంట్రాక్టర్లు తీసుకువస్తున్నారు. కానీ, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పరిశ్రమల యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడే కార్మిక తదితర శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు తప్పా మిగతా సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పటాన్చెరు, ఏప్రిల్ 8: పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 4020 వరకు పరిశ్రమలు ఉండగా, వీటిలో 1960 రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో 2.50లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్నారు. వీరే కాకుండా ఉద్యోగులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. కానీ, పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించేందుకు యాజమాన్యాలు కనీస సౌకర్యలు కల్పించక పోవడంతో కార్మికులకు రక్షణ లేకుండా పోతున్నది.
పరిశ్రమల్లో తరుచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో కార్మికులు బాధితులుగా మారుతున్నారు. ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో భారీ, మధ్య తరహా, చిన్న పరిశ్రమలు వందలాదిగా ఉన్నాయి.
వీటిలో పనిచేస్తున్న తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాలకు చెందిన కార్మికులకు భద్రత కోసం దుస్తులు, హెల్మెట్లు, మాస్కులు పరిశ్రమల యాజమాన్యాలు అందించడం లేదని తెలిసింది. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో రక్షణ పరికరాలు లేక కార్మికులు తీవ్ర గాయాలకు గురైన సంఘటనలు ఈ ప్రాంతంలో అనేకం చోటుచేసుకున్నాయి. పరిశ్రమలను తనిఖీ చేసే అధికారులు యాజమాన్యాలకు మద్దతుగా ఉండడంతో ప్రమాదాలకు నివారణ చర్యలు తీసుకోవడం లేదని తెలిసింది.
నిబంధనల ఉల్లంఘనే ప్రమాదాలకు కారణం
అనేక పరిశ్రమల్లో ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అధికారులు పరిశ్రమల్లో రికార్డులకే తనిఖీలు చేసి వెళ్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేస్తే లోపాలు గుర్తించి, పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలి.
ప్రతి ఏడాది వేసవికి మందే చిన్న, మధ్య, భారీ పరిశ్రమలను తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాలు అగ్నిమాపక శాఖ అధికారులు అందజేయాల్సి ఉంటుం ది. పారిశ్రామికవాడల్లో అసలు చాలా పరిశ్రమలకు అనుమతులు లేకుండానే ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో తేలింది. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరిగినా పట్టించుకోవడం లేదనే తెలిసింది. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేస్తున్నారు.
మిగతా సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పరిశ్రమల్లో అగ్నిమాపక పరికరాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రియాక్టర్లు, బాయిలర్లు, పొగ గొట్టాలు, ఇతర యంత్రాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. రియాక్టర్లు, బాయిలర్లు వద్ద ప్రమాదాలు పసిగట్టి, కార్మికులను అప్రమత్తం చేసే సాంకేతిక పరికరాలు చాలా పరిశమ్రల్లో ఏర్పాటు చేయలేదు.
గ్యాస్ లీకేజీలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ చేయడం లేదు. గతేడాది పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో బాయిలర్లు పేలి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనేక భద్రతా లోపాలున్నాయని, కొన్ని పరిశ్రమలు నిబంధనలు పాటించడం లేదని గుర్తించామన్నారు. తీరా కొన్నిరోజుల తర్వాత పరిశ్రమల వైపు చూడడం లేదు.
కలెక్టర్ ఆదేశాలతో మూడు పరిశ్రమలు సీజ్
భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన మూడు పరిశ్రమలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి గత సంవత్సరం ఫిబ్రవరి 14న కొరడా ఝళిపించారు. పాశమైలారం పారిశ్రామికవాడలో సాల్యూబ్రియస్ లెబొరేటరీస్, వైటల్ సింథటిక్స్, వెంకర్ కెమికల్స్ పరిశ్రమల్లోను భద్రతా ప్రమాణాలు లేవని గుర్తించి, పరిశ్రమల మూసివేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆర్డీవో రవీందర్రెడ్డి, పీసీబీ, కార్మిక శాఖ, పరిశ్రమల భద్రతా శాఖ అధికారుల బృందం మూడు పరిశ్రమలను సీజ్ చేశారు. ఫిబ్రవరి 13న రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన పరిశ్రమలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అనేక పరిశ్రమలకు నిలయం
పటాన్చెరు ప్రాంతంలో ఔషధ, జీవశాస్త్ర పరిశ్రమలతో పాటు వస్త్ర, రసాయన, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. వీటితో పాటు పలు రకాలు వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏర్పాటు చేశారు. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. పరిశ్రమల్లో కార్మికులకు భద్రతకు రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ధరంచడం తప్పునిసరిగా ఉండాలి. యంత్రాలు, పరికరాలను నిత్యం పరీక్షించి మెయింటెనెన్స్ చేయాలి.
లోపాలు ఉన్న పరికరాలు ఉపయోగించకుండా తక్షణం మరమ్మతులు చేయాలి. కార్మికులు పనిచేసే ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాద సమయంలో తక్షణం పారిపోవడానికి అవసరమైన మార్గాలు ఏర్పాటు చేయాలి. పరిశ్రమల్లో ఎలాంటి సౌకర్యాలు కలిపించడం లేదు. పటాన్చెరు ప్రాంతంలోని పరిశ్రమల్లో ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహారు, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నా రక్షణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.