చిన్న పిల్లలకు దగ్గు, జలుబు సాధారణ సమస్య. అయిదు నుంచి ఏడు సంవత్సరాల పిల్లల్లో దగ్గు, జలుబు (కామన్ కోల్డ్ – అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్) ఎక్కువగా వస్తుంది. పిల్లల్ని బడిలో, డే కేర్ సెంటర్లో చేర్పించిన తర్వాత ఏడాదికి ఆరు నుంచి ఏడు సార్లు కామన్ కోల్డ్ బారిన పడతారు. ఈ సమస్యకు ప్రధాన కారణం వైరస్లు. కొన్నిటికి బ్యాక్టీరియా కూడా కారణం కావచ్చు. ఈ సమస్య వల్ల జ్వరం, జలుబు, దగ్గు, గురక, బాగా తినలేక, రాత్రి సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. వైరస్ల వల్ల వచ్చే జలుబు, దగ్గుకు మందులు వాడినా, వాడకున్నా అయిదు నుంచి ఆరు రోజుల్లో తగ్గుతుంది. ఆ వైరస్‌లపై శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పోరాటం చేస్తుంది. యాంటి బయాటిక్స్ అవసరం ఉండదు. అనవసరంగా మందులు వాడకండి. ఈ విషయం పట్ల అవగాహన లేక చాలామంది మెడికల్ షాపుల్లో నేరుగా అడిగి తెచ్చుకున్న మందులు వాడుతుంటారు. ఈ మందుల్లో క్లోరోఫీనోరమైన్ మలేట్, ఫినైల్ ఫెరైన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్‌గా ఉంటాయి.
ఈ రెండు డ్రగ్స్ కాంబినేషన్ కలిగిన సిరప్‌లను నాలుగేళ్లలోపు పిల్లలకు ఇవ్వకూడదని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, భారత కుటుంబ ఆరోగ్య, సంక్షేమ శాఖ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ రెండు డ్రగ్స్ కాంబినేషన్లో తయారుచేసిన సిరప్‌పై నాలుగేళ్లలోపు చిన్న పిల్లలకు వాడకూడదనే సూచన ఉన్నా, ఆ విషయాన్ని గమనించకుండా వాడుతున్నారు. పెద్దలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ మందులు తెచ్చిపెట్టుకుంటారు. పిల్లలకు అవే ఇస్తారు. ఈ రెండు డ్రగ్స్‌ని పారాసిటమాల్‌తో కలిపి అమ్ముతారు. దగ్గు, జలుబు, జ్వరం వస్తే ఈ సిరప్ వాడతారు. జ్వరం వచ్చినా వాడతారు. ఇలా వాడటం వల్ల శరీరంలో పారసిటమాల్ మోతాదు ఎక్కువవుతుంది. డోస్ ఎక్కువ అయినా, తరచుగా వాడినా పిల్లల్లో గుండె వేగం పెరుగుతుంది. ఎక్కువగా నిద్ర పోతారు. ఒక్కోసారి ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. జలుబు, దగ్గు వస్తే.. వేడి ద్రవాహారం ఇస్తే గొంతు గురగుర సమస్య పోతుంది. తరచుగా ముక్కు దిబ్బడ వేస్తుంది. నాసల్ స్లైన్ వాడితే రిలీఫ్ వస్తుంది. జ్వరం ఉంటే.. పారాసిటమాల్ వేసుకోవాలి. సొంతంగా సిరప్‌లను కొని పిల్లలకు ఉపయోగించొద్దు.