మాస్కో: ‘ఆపరేషన్ సిందూర్’పై వివరించేందుకు రష్యాకు వెళ్లిన భారత ప్రతినిధి బృందం ప్రయాణించిన విమానం గురువారం గాలిలో కొన్ని గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడి నేపథ్యంలో మాస్కో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఎట్టకేలకు ఈ విమానం సురక్షితంగా దిగింది.
డీఎంకే ఎంపీ కనిమొళి నాయకత్వంలోని అఖిలపక్ష ఎంపీల బృందానికి రష్యాలోని భారత దౌత్య కార్యాలయం అధికారులు స్వాగతం పలికి, హోటల్‌కు తీసుకెళ్లారు. భారత దౌత్య కార్యాలయం ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, అన్ని రూపాల్లోని ఉగ్రవాదంపై పోరాడటంపై భారత దేశ దృఢ సంకల్పాన్ని తెలియజేసేందుకు కనిమొళి నేతృత్వంలోని అఖిల పక్ష ఎంపీల ప్రతినిధి బృందం మాస్కోకు చేరుకున్నట్లు తెలిపింది.