న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఉద్యోగులకు శుభవార్త. నెలవారీ పెన్షన్ త్వరలో పెరిగే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ పెన్షన్స్ను పెంచడానికి ఈపీఎఫ్‌వో (ఉద్యోగ భవిష్య నిధి సంస్థ) ఓ కొత్త ప్లాన్‌ను తీసుకురావాలని చూస్తున్నది. నిజానికి పెన్షన్ స్కీం-1995 కింద కనీస పెన్షన్‌ను పెంచాలంటూ ఎప్పట్నుంచో వేతన జీవులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నది. ఈ క్రమంలోనే ఈపీఎఫ్‌వో నయా పెన్షన్ ప్లాన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
స్వయం ఉపాధి వర్గాలకూ లాభించేలా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. జమచేసే సొమ్ము ఆధారంగానే ఈ ఫిక్స్డ్ పెన్షన్ మొత్తాలుంటాయి. ప్రస్తుత ఎంప్లాయీ స్ పెన్షన్ స్కీం (ఈపీఎస్)లో ఉద్యోగి బేసిక్ సాలరీలో 12 శాతం పీఎఫ్‌కు వెళ్తున్నది. మరో 12 శాతం సంస్థ ద్వారా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో చేరుతున్నది. అయినప్పటికీ నెలవారీ పెన్షన్ రూ.15,000 దాటరాదు. దీంతో గరిష్ఠంగా పెన్షన్ ఫండ్‌కు చేరే నెలవారీ మొత్తం రూ.1250గానే ఉంటున్నది. ప్రస్తుతం ఈపీఎస్‌కు జమవుతున్న మొత్తాలపై పన్ను లేదు. దీంతో దీన్ని పెంచాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అదనపు పెన్షన్‌తో ఊరటనివ్వాలని ఈపీఎఫ్‌వో భావిస్తున్నట్టు వినిపిస్తున్నది.