Monalisa | కుంభమేళాలో ఒక్క ఫోటోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిన గిరిజన యువతి మోనాలిసా ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రేమ వివాహం చట్టపరమైన సమస్యల్లో పడడంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సహజమైన అందంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా, అనంతరం ఫర్మన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమవడంతో విచారణ ప్రారంభమైంది.జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం బయటపడింది. మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించినట్లు తేలింది. అంటే 2026 మార్చిలో వివాహం జరిగే సమయానికి ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.
భారత చట్టాల ప్రకారం వివాహానికి కనీస వయస్సు లేకపోవడంతో, ఆమె భర్తపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసు మరింత సీరియస్ మలుపు తీసుకుంది.ఈ కేసులో మరో సంచలన అంశం కూడా బయటపడింది. పెళ్లి జరిపించేందుకు మోనాలిసా పుట్టిన తేదీని మారుస్తూ నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది. 2008లో పుట్టినట్లు చూపిస్తూ తప్పుడు సర్టిఫికెట్ల ఆధారంగా కేరళలోని ఆలయంలో వివాహం నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.ఈ వ్యవహారంలో కొన్ని సంస్థల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాధారణ ప్రేమ వివాహం కాదని, ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా చేసిన చర్యగా అధికారులు పరిశీలిస్తున్నారు.
కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించిన ఈ కేసును విచారణ బృందం కేవలం 72 గంటల్లోనే కీలకంగా ఛేదించింది. మహేశ్వర్ మున్సిపల్ అధికారులు ఇచ్చిన పాత జనన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మోనాలిసా తల్లిదండ్రులు సమర్పించిన కుల ధృవీకరణ పత్రాల ద్వారా ఆమె షెడ్యూల్డ్ తెగకు చెందిన మైనర్ బాలిక అని కూడా నిర్ధారితమైంది. మైనర్ బాలికని వివాహం చేసుకున్నందుకు ఫర్మన్ ఖాన్ ప్రస్తుతం తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక ఫోటోతో వచ్చిన పాపులారిటీ మోనాలిసా జీవితాన్ని మార్చేస్తుందని అందరూ భావించారు. కానీ అదే సమయంలో చట్ట విరుద్ధమైన పెళ్లి ఆమెను వివాదాల మధ్యకు నెట్టింది.