Mohammed Shami | టీంఇండియా పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)పై నమోదైన దాడి, హత్యాయత్నం, గృహహింస(Domestic Violence) కేసులో సుప్రీంకోర్టు( కీలక ఆదేశాలు జారీ చేసింది. షమీపై నమోదైన ఈ కేసు విషయంలో నెల రోజుల్లోపు తుది నిర్ణయం (Final Verdict) తీసుకోవాలని పేర్కొంది. సుప్రీంకోర్ట్ (Supreme Court) చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు పశ్చిమ్ బంగా సెషన్స్ కోర్టుకు గురువారం స్పష్టంచేసింది.
షమీపై జారీచేసిన అరెస్టు వారెంట్‌ను నిలిపివేస్తూ కలకత్తా హైకోర్టు (Kolkata High Court) ఈ ఏడాది మార్చి 29న తీర్పు (Verdict) వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అతని సతీమణి హసీన్ జహాన్ (Hasin Jahan) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హాసీన్ జహన్ దాఖలు చేసిన ఈ అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. షమీపై నమోదైన కేసులో క్రిమినల్ రివిజన్ (Criminal revision) చేపట్టాలని సెషన్స్ న్యాయమూర్తిని ఆదేశించింది. నెల రోజుల్లోపు ఈ కేసుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
షమీ-హసీన్ 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2018లో షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేసింది. ఈ విషయంపై హసీన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, హత్యాయత్నం, గృహహింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది.