ప్రధాని మోదీ ఆహ్వానం
వాటికన్ సిటీ, అక్టోబర్ 30: ప్రధాని మోదీ శనివారం పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. కరోనా, వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లు తదితర కీలకాంశాలపై చర్చించారు. భారత్‌కు రావాల్సిందిగా పోప్‌ను ఆహ్వానించారు. వాటికన్లోని అపొస్టొలిక్ ప్యాలస్‌లో మోదీకి పోప్ స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని, పోప్ మధ్య సమావేశం జరుగడం ఇదే మొదటిసారి. 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి వాటికన్‌ను సందర్శించి అప్పటి పోప్ జాన్ పాల్ 2ను కలిశారు. షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాల పాటు జరుగాల్సిన వారి భేటీ గంట పాటు కొనసాగింది. మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఉన్నారు.
పోప్ ఫ్రాన్సిస్‌కు మోదీ ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి కొవ్వొత్తుల స్టాండ్‌తో పాటు వాతావరణ పరిరక్షణకు భారత్ కృషి వివరించే పుస్తకాన్ని బహూకరించారు. పోప్ కూడా మోదీకి బహుమతులు ఇచ్చారు.
కరోనాపై పోరులో ప్రపంచానికి సహాయం అందించేందుకు వచ్చే ఏడాది చివరికల్లా 500 కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారుచేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని మోదీ తెలిపారు. శనివారం రోమ్‌లో జీ 20 సదస్సులో ఆయన ప్రసంగించారు. కరోనా సమయంలో పలు దేశాలకు భారత్ నుంచి ఔషధాలు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారత్ దేశీయ టీకా కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ అనుమతి లభిస్తే ఇతర దేశాలకు సహాయం అందించడంలో భారత్‌కు ఊతం లభిస్తుందని తెలిపారు. దేశాలు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించాలని, అలాగే అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కరోనాపై పోరు, భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’పై ఆలోచించాల్సి ఉందని చెప్పారు.