న్యూఢిల్లీ, మే 16 : పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచిన మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వెండి దిగుమతులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. ఈ నూతన ఆంక్షలు వెంటనే అమలులోకి రానున్నట్టు ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఇక నుంచి వెండి దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్స్ పొందివుండాలని విదేశీ వాణిజ్య విభాగ డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 13న పసిడి, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విదేశీ మారకం నిల్వలు తరలిపోతున్నాయన్న ఉద్దేశంతో కేంద్రం వరుసగా పలు దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నది.
దీంట్లో భాగంగా వెండి, బంగారం, ప్లాటినంతో పూత పూసిన వెండి ఆభరణాల దిగుమతులపై ఆంక్షలు విధించింది. గత నెలలో వెండి దిగుమతులు రెండు రెట్లు పెరిగి 411 మిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నెలవారీ డాటాలో పేర్కొంది. అలాగే 2025-26లో వెండి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 150 శాతం ఎగబాకి 12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విలువ పరంగా చూస్తే 42 శాతం అందుకొని 7,334.96 టన్నులకు చేరాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.53 లక్షలుగా ఉన్నది. మరోవైపు, విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయి 728.49 బిలియన్ డాలర్ల నుంచి 690 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.