న్యూఢిల్లీ : అమెరికా, భారత్ మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ తప్పటడుగు వేసిందా? తాత్కాలిక ప్రయోజనాలకు తలొగ్గి చిరకాల మిత్రదేశమైన రష్యాను దూరం చేసుకుందా? ట్రంప్‌ను నమ్ముకుని ముందుకు వెళ్లడం అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే అన్న విషయం మోదీ ప్రభుత్వానికి తెలియదా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆర్థిక నిపుణులు, మేధావులు, ప్రతిపక్షాల నేతలు సంధిస్తున్నారు. అమెరికాతో మోదీ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం పలు వ్యూహాత్మక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ నష్టాలు, కష్టాలను కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
రష్యాకు బదులుగా వెనెజువెలా నుంచి చమురును కొనుగోలు చేయడమంటే ఇంధన భద్రతకు సంబంధించిన సార్వభౌమాధికారం అగ్రరాజ్యానికి మోదీ తాకట్టు పెట్టినట్టేనని ఆర్థిక నిపుణులు, మేధావులు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లోని అంతర్గత నిర్ణయాల మీద అమెరికా పర్యవేక్షణ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రష్యా మనకు దశాబ్దాల మిత్ర దేశం. చవగ్గానే అక్కడి నుంచి మనకు చమురు దిగుమతి అవుతుంది. ఇప్పుడు, డీల్ ముసుగులో రష్యాతో సంబంధాలు తెంచుకొంటే.. అది భారత్‌కు ఆర్థికంగానే కాదు దౌత్యపరంగానూ ఎంతమాత్రం మంచిది కాదని, తాత్కాలిక ప్రయోజనాల కోసం అమెరికా వెంట వెంపర్లాడ వద్దంటూ వారు హెచ్చరిస్తున్నారు. ట్రేడ్ ప్రకటన కూడా ట్రంపే చేశారు తప్ప ఇద్దరూ కలిసి ఉమ్మడిగా చేయని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు తొలుత ట్రంప్ ప్రకటించడాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంటే భారత్‌పై ట్రంప్ అజమాయిషీ చేస్తున్నారని, ఇది తెలిసినా మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నదే తప్ప ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని వారు విమర్శిస్తున్నారు.
టారిఫ్‌ల నుంచి ఉపశమనం కోసం అమెరికా పెట్టిన అడ్డమైన షరతులకు భారత్ తలొగ్గిందన్న విమర్శలు ఉద్ధృతమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా జాతీయ భద్రతా చర్యల్లో భాగంగా రూపొందించిన విధానాలు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిలో రాజీ పడినట్టు కనిపిస్తున్నది. ‘వాషింగ్టన్‌తో భారత్ చాలా దగ్గరగా ఉందని రష్యా భావిస్తే.. అది సైనిక హార్డ్‌వేర్, అణుశక్తి, అంతరిక్ష సహకారంలో కీలకమైన మద్దతు సహా దీర్ఘకాలిక రక్షణ, ఇంధన భాగస్వామ్యాలను క్షీణింప చేస్తుంది. భౌగోళిక రాజకీయ పరంగా ఈ ఉత్తర్వు భారతదేశం యుక్తి స్వేచ్ఛను తగ్గిస్తుంది’ అని నిపుణులు అంటున్నారు.
గత ఎన్నో దశాబ్దాలుగా భారత్‌కు రష్యా అత్యంత స్థిరమైన రక్షణ భాగస్వామిగా ఉంది. అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తే.. అది మాస్కో ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపడమే కాక, ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, దీర్ఘకాలిక సహకారం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్పును అమెరికా ఒత్తిడికి భారత్ లొంగిపోయిందని రష్యా భావిస్తే రక్షణ సామగ్రి, ఆధునిక సాంకేతికత, ఆయుధాల ఉమ్మడి ఉత్పత్తికి భారత్ ప్రాధాన్యతను ఆ దేశం తగ్గించవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగంలోని జలాంతర్గాములు, ఎస్-400 వ్యవస్థలు, ఇతర సైనిక వ్యవస్థల వంటి వ్యూహాత్మక కీలకమైన ఆయుధాల సరఫరాలో దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. ఇంధన భద్రతలో దుర్భలత్వం, విదేశాంగ విధాన స్వయం ప్రతిపత్తిపై ఒత్తిళ్లు, రష్యాతో సంభావ్య ఘర్షణ వంటి దీర్ఘ కాలిక నష్టాలూ ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ బాధ్యతలను భౌగోళిక రాజకీయ లక్ష్యాలతో ఎలా సమతుల్యం చేస్తుందనే దానిపై పరిణామాలు ఆధారపడి ఉంటాయి.
ఇక రష్యాకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకొంటే భారత్‌కు రవాణా ఖర్చు తడిసిమోపెడవుతుంది. వెనెజువెలా భారత్ సగటు దూరం 13,000-15,000 కి.మీ. ప్రయాణ కాలం 40-45 రోజులు. అంటే రెట్టింపు దూరం, రెట్టింపు సమయం పడుతుంది. దీంతో రవాణా ఖర్చు కూడా 30-50 శాతం ఎక్కువ అవుతుంది. దీనికి తోడు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువే. అలాగే రష్యా చమురు లైట్ క్రూడ్ కావడంతో దీనిని తక్కువ ఖర్చుతో సులువుగా ప్రాసెస్ చేయవచ్చు. ఇక వెనెజువెలా చమురు హెవీ క్రూడ్ కావడంతో ఇది శుద్ధి చేయడం కష్టమే కాక, ఖర్చుతో కూడుకున్నది. అలాగే రష్యా చమురుపై లభించే డిస్కౌంట్ వెనెజువెలా చమురుపై లభించదు. మొత్తం మీద భారత్‌కు దిగుమతి బిల్లు పెరుగుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం మీద కూడా ప్రభావం చూపుతుంది.
వాణిజ్య ఒప్పందం పేరుతో అమెరికా.. భారత విదేశాంగ విధానంలో జోక్యం చేసుకుంటున్నదని పలువురు ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. షరతులతో కూడిన ఒప్పందాలు, ఆంక్షలు, బెదిరింపులు ఇవన్నీ భారత విదేశాంగ విధానాన్ని అడ్డుకునేవేనని వారు అంటున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే విమర్శలు, బెదిరింపులు, ఇరాన్‌తో వాణిజ్యం చేయవద్దంటూ హూంకరింపులు ఇవన్నీ తమ స్వతంత్ర విదేశాంగ విధానానికి పూర్తి విరుద్ధమని వారు తెలిపారు. అమెరికా చిన్న దేశాలను చూసిన దృష్టితోనే భారత్‌ను చూడటం, దానికి మన పాలకులు తలవూపడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ‘అమెరికా ఆదేశాలు ఇవ్వగల స్థితిలో లేదు.. భారత్ దానికి తలొగ్గే దుస్థితిలో లేదు ’ అని వారు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం కూడా ట్రంప్ చెప్పిన దాని కల్లా తల ఊపకుండా తమ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కాపాడుకోవాలని వారు కోరుతున్నారు.
పాకిస్థాన్‌లో శుక్రవారం ఒక మసీదుపై ఉగ్రదాడిలో 31 మంది మరణించిన ఘటనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఆత్మాహుతి దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ సహకారం ఉంటుందని హామీనిచ్చారు. ఈ మేరకు ఆయన పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లకు సంతాపం సందేశం పంపుతూ దేశానికి, బాధిత ప్రజలకు తన సానుభూతి తెలిపారు. పాక్‌లో జరిగిన ఈ దాడిలో విదేశాల ప్రమేయం ఉందంటూ ఆ దేశ రక్షణ మంత్రి పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి ప్రకటించగా, దానిని భారత్ తీవ్రంగా ఖండించింది. కాగా, పాకిస్థాన్‌లో ఉగ్రదాడిని పుతిన్ ఖండించడం చూస్తే భారత్‌పై ఆ దేశానికున్న మిత్రదేశ వైఖరిలో మార్పు వచ్చిందా? పాక్‌ను భారత్‌కు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఒత్తిడితో రష్యాతో పూర్తిగా చమురు దిగుమతిని భారత్ బంద్ చేసిన క్రమంలో పుతిన్ తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణాసియాలో భారత్ స్థానంలో ఆయన పాకిస్థాన్‌ను తన మిత్రదేశంగా మార్చుకుంటారా? అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా తన చమురును అమ్మేందుకు కొత్త మార్కెట్ల అవసరం ఉందని, పాకిస్థాన్ ఇప్పటికే మాస్కోతో క్రూడ్ అయిల్, ఎల్ఎన్జీకి సంబంధించి కొన్ని ఎంఓయూలు కుదుర్చుకుందని అధికార వర్గాలు తెలిపాయి.