హైదరాబాద్, మే 6: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నది. ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్‌లో ఈ డ్రిల్స్ నిర్వహించనున్నారు. పాక్‌తో అంతర్జాతీయ సరిహద్దు, అణుప్లాంట్లు, సైనిక స్థావరాల వంటి కీలక సదుపాయాలు, జనాభా వంటి అంశాల ఆధారంగా ఈ జిల్లాలను మూడు క్యాటగిరీలుగా విభజించగా, హైదరాబాద్‌ను క్యాటగిరీ-2లో చేర్చారు. నగరంలో నాలుగు (సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్డీవో, మౌలాలి ఎన్ఎఫ్సీ) ప్రదేశాల్లో ఈ సెక్యూరిటీ డ్రిల్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో ఎలావ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పోలీసు, అగ్నిమాపక సర్వీసులు, విపత్తు నిర్వహణ దళం సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో సాయంత్రం 4 గంటలకు సైరన్ మోగడం(వైమానిక దాడికి హెచ్చరికగా) ప్రారంభమవుతుందని, మాక్ డ్రిల్ ముగింపునకు సూచనగా తిరిగి సాయంత్రం 4.30 గంటలకు సైరన్ మోగుతుందని ఆ అధికారి చెప్పారు. సైరన్ మోగిన వెంటనే ప్రజలు తమకు తాముగా షెల్టర్ జోన్లోకి వెళ్లిపోవలసి ఉంటుందని ఆయన తెలిపారు. క్యాటగిరి -1లో న్యూఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్, సూరత్, వడోదర, కాక్రపార్, ముంబై, కోటా, కల్పకం, బులంద్ షహర్ వంటివి ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో…
కాగా, దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో బుధవారం జరగనున్న మాక్ సెక్యూరిటీ డ్రిల్‌కు రంగం సిద్ధమైంది. శత్రు దాడి జరిగిన పక్షంలో ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు తీసుకోవలసిన చర్యలలో శిక్షణ ఇచ్చేందుకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సంసిద్ధమవుతున్నాయి. వైమానిక దాడికి సంబంధించిన సైరన్లకు ఎలా స్పందించాలి, సురక్షిత ప్రదేశాలకు తరలిపోవడం, బంకర్లు, కందకాలను శుభ్రం చేసుకోవడం తదితర అంశాలలో ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలు, రిఫైనరీలు, హైడ్రోఎలక్ట్రిక్ డ్యాంలు వంటి కీలక ప్రదేశాలలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. 1971 తర్వాత అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఎలా ఉండాలన్న విషయమై మొదటిసారి ప్రజలకు శిక్షణ లభించనున్నది. దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ ప్రారంభం కానున్నది.
మాక్ డ్రిల్‌లో దాదాపు 6 లక్షల మంది వలంటీర్లు పాల్గొనవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమైన నేపథ్యంలో ఎదురవుతున్న జఠిలమైన హెచ్చరికల కారణంగా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిన ఆవశ్యకతను కేంద్ర హోం శాఖ సోమవారం తెలియచేసింది. ఈ మాక్ డ్రిల్స్‌లో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, దవాఖాన సిబ్బంది, రైల్వే, మెట్రో అధికారులతోపాటు పోలీసు, పారామిలిటరీ, రక్షణ దళాల సిబ్బంది పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాలతోపాటు అణు కేంద్రాలు వంటి కీలక స్థావరాలు లేదా సరిహద్దు వెంబడి ఉన్న నగరాలను శత్రు దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న కీలక జోన్లుగా పరిగణిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ జోన్ల సామర్థ్యాన్ని తనిఖీ చేయడంతోపాటు ఎక్కడైనా లోపాలుంటే సివిల్ డిఫెన్స్ అధికారులు సరిచేస్తారని వర్గాలు వివరించాయి. కీలక జోన్లను గుర్తించే ప్రక్రియ మరో మూడు రోజులు కొనసాగుతుందని వారు తెలిపారు.
హోం కార్యదర్శి ఉన్నత స్థాయి సమావేశం
కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగింది. ప్రజల క్రియాశీలక భాగస్వామ్యంతో మాక్ డ్రిల్ ఎలా నిర్వహించాలన్న విషయమై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నతస్థాయి సివిల్, పోలీసు అధికారులు పాల్గొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మాక్ డ్రిల్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపాయి. ఆపరేషన్ అభ్యాస్ పేరిట నిర్వహించనున్న ఈ రిహార్సల్స్‌కు పంబంధించిన మార్గదర్శకాల జాబితాను ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది. దేశ రాజధాని వ్యాప్తంగా 55 ప్రదేశాలలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. వైమానిక దాడి సైరన్లను గుర్తించడం, సమీపంలోని బేస్మెంట్లు, అండర్‌గ్రౌండ్ కారు పార్కింగ్ స్థలాలు, ఇతర సురక్షిత జోన్లను గుర్తించడం, టార్చి, ఎమర్జెన్సీ కిట్, నీళ్ల సీసాలు వంటివి సిద్ధంగా ఉంచుకోవడం వంటి విషయాలపై పౌరులకు శిక్షణ ఇవ్వనున్నారు. సైరన్లు వినిపించినపుడు వెంటనే అప్రమత్తమై బయటి పనులు మానేసి సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు చేరుకోవడం, ఎమర్జెన్సీ సర్వీసులకు కమ్యూనికేషన్ అంతరాయం కలుగకుండా ఫోన్ల వాడకాన్ని నిలిపివేయడం వంటివి ప్రజలు చేయాల్సిన పనులని అధికారులు తెలిపారు. కశ్మీరులో సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ జరుగుతుందని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహనా దళం(ఎస్డీఆర్ఎఫ్), సివిల్ డిఫెన్స్ ప్రకటించాయి.
సరిహద్దుల్లో యుద్ధ విమానాల గర్జన నేడు, రేపు వాయుసేన విన్యాసాలు
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌తో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి వాయుసేన రెండు రోజులపాటు వైమానిక విన్యాసాలను చేపట్టనుంది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలయ్యే ఈ డ్రిల్స్.. గురువారం రాత్రి 9.30 గంటలకు ముగుస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. రాఫెల్, మిరాజ్-2000, సుఖోయ్-30ఎస్, తేజస్ తదితర యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నట్టు తెలిపాయి. భారత వాయుసేన సామర్థ్యాలను ఈ విన్యాసాల్లో ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నాయి.