హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది జూన్ 25 తర్వాత మరణించిన 20 మంది ఉపాధ్యాయులకు ప్రమాద బీమా కింద రూ.కోటి ఆర్థిక సాయం ఎక్కడ..? అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమాద బీమా పథకం అమలు’ అనే అంశంపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రూ.కోటి ప్రమాద బీమా ఇస్తామని జీవో తెచ్చిందని.. మరి క్షేత్రస్థాయిలో ఈ స్కీమ్ అమలవుతున్నదా..? అని ప్రశ్నించారు.
ఉద్యోగి చనిపోతే తక్షణసాయంగా అంతిమ సంస్కారాలకు రూ.30వేలు చెల్లించే వ్యవస్థ ఉన్నదని, కానీ ఆ బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హెల్త్ కార్డు పథకం అమలును మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.