హైదరాబాద్, డిసెండర్ 17 (నమస్తేతెలంగాణ) : గురుకులాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గురుకులాల ఘటనలపై, రైతులపై సర్కారు దమననీతిపై ధ్వజమెత్తారు. ఏడాదికాలంగా రాష్ట్రంలో గురుకులాలు విద్యార్థుల హాహాకారాలతో మార్మోగుతున్నాయని, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆడిగితే పాలకులు దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది కాలంలోనే 850 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. అస్వస్థతతోపాటు పాముకాటు, ఎలుకలు కరిసిన ఘటనల్లో ఎందరో విద్యార్థులు మృతి చెందారని తెలిపారు. వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వం మారిన ఈ ఏడాదిలోపే గురుకులాలు ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. గురుకులాల ఘటనలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తున్నదని డిమాండ్ చేశారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడేవారని, ఇప్పుడు వద్దు వద్దు బిడ్డో గురుకుల పాఠశాలకు.. అని పాడుకోవాల్సి వస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది గురుకులాల నుంచి పిల్లలు ఇంటి బాటపట్టారని, ఫలితంగా వేలాది సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాస్తవాలు గ్రహించి తప్పులను సరిచేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూదాహం రైతులకు శాపంగా మారిందని మధుసూదనచారి విమర్శించారు. లగచర్ల రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీనికి నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వం అక్కడి రైతులను తమ సొంత భూముల నుంచి వెల్లగొట్టే కుట్ర చేస్తుందని విమర్శించారు. లగచర్ల రైతాంగానికి పూర్తి న్యాయం జరగాలని, అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం తిరసరించడం సరికాదని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. రెండు రోజులుగా రైతుల పక్షాన మండలిలో నిరసన తెలిపామని చెప్పారు. తమ భూములను లాకోవద్దని నినదించిన రైతులను ఈ ప్రభుత్వం జైల్లో పెట్టిందని, గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లడం ఈ సర్కారు దమననీతికి నిదర్శనమని విమర్శించారు.