SIR | కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు సర్ (SIR)పై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఓట్లు పోకుండా చూసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పై తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పరిశీలించామని తెలిపారు. ఓటర్ మ్యాపింగ్ సరిగ్గా జరగలేదని, సర్పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. ఫారాల పంపిణీ అనుకున్న విధంగా జరగాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే చేశారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు 37 శాతం మాత్రమే ఫారాలను నింపడం పూర్తయిందని, అదనపు సమయం కావాలని బీఆర్ఎస్ కోరుతుందని అన్నారు. సర్ ప్రక్రియపై ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిందని వెల్లడించారు.
బీఆర్ఎస్ అనేక సూచనలు చేసింది: కర్నె ప్రభాకర్
బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే అనేక విజ్ఞాపన పత్రాలను ఎన్నికల సంఘానికి ఇచ్చామని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి అనేక సూచనలు చేసిందని అన్నారు. సర్పై పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ రెడీగా లేదని తెలిపారు. బీఎల్వోలు నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు తప్పవని, వారు ప్రతి ఇంటికి వెళ్లాలని, బీఎల్ఏలు వారికి సహకరించాలని కోరారు. దీనిపై రేపు ఎన్నికల సంఘం అధికారులను కలిసి విజ్ఞాపన పత్రం అందిస్తామని పేర్కొన్నారు. నాగర్ సాహెబ్ కుంటలో ఎండీ అస్లాం అనే వ్యక్తి తన ఓటు పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారని, ఏటూరు నాగారంలో మండల కేంద్రంలో ఫారాలు హైస్కూల్లో ఇవ్వాలని ఎండీవో చెప్పారని వెల్లడించారు. వీటిపై ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఉండాలని, ఫిర్యాదులపై జిల్లా స్థాయిలో సమీక్షలు జరగాలని వన్నవించారు. సర్పై అప్రమత్తంగా లేని అధికారులను విధుల నుంచి తప్పించాలని, అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలని ఆయన కోరారు.
ఓటు హక్కు కీలకం: వై సతీశ్ రెడ్డి, టీఎస్ రెడ్కో మాజీ చైర్మన్
ప్రజలకు ఓటు హక్కు కీలకమని, దాదాపు 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లకు నోటీలు వెళ్లే అవకాశం ఉందని టీఎస్ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఒక్క ఓటు పోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
బాధ్యత వహించాలని అన్నారు.
హైదరాబాద్ నగరంలో సర్ కేవలం 13 శాతం అయిందని, బీఎల్వోలు ఇళ్లకు వెళ్లకుండా టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారని ఇది సరికాదని తెలిపారు. దీనిపై బీఎల్వో (BLO) లకు అవగాహన లేదని,
తెలంగాణ ప్రజల ఓట్లు గాల్లో ఉన్నాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. మీడియా సమావేశంలో ‘సర్’ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు సుమిత్రానంద్, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.