దుండిగల్, ఏప్రిల్ 8 : కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గాగిల్లాపూర్‌లో రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్ నిరసన తెలిపారు. నల్ల జెండాలు పట్టుకుని గ్రామంలోని వీధివీధినా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న పక్షపాత ధోరణిని ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంజాబ్‌లో పూర్తి ధాన్యం కొంటూ తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం రైతుల ఆగ్రహావేశాలు చవిచూడక తప్పదని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు పొంతనలేని మాటలతో రైతులను ఆందోళనలో పడేశారని, వారికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నూకలు తినాలని రాష్ట్ర ప్రజలను అవహేళన చేసిన బీజేపీకి నూకలు చెల్లే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ నాయకులకు రైతుల ఉసురు తగులుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, శంకర్ నాయక్, దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మండల రైతు సమాఖ్య నాయకులు గోపాల్‌రెడ్డి, జైరాజ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.