జూబ్లీహిల్స్, జూన్ 27: పేదల పక్షపాతిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సంతాప సభ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో గెలిపించి ఆయనకు అసలైన నివాళి అర్పించాలని అన్నారు. మాగంటి గోపినాథ్ ప్రతి అడుగు పేదల కోసం వేశాడని.. పేద ప్రజలే తన కుటుంబంగా భావించాడని అన్నారు.
ఆపదలో అపద్భాందవుడిగా అన్ని వర్గాలలో అపారమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న ఏకైక నేత మాగంటి అన్నారు. కార్యకర్తలను ఆయన ఎంతో ఆత్మీయంగా భావించేవారో బోరబండ మైనార్టీ నేత సర్దార్ సంఘటనే సజీవ సాక్ష్యమని.. సర్దార్ అతని కుటుంబ సభ్యులకు దూరం అయ్యాడని చివరి క్షణం వరకు మనో వేదన పడ్డాడాని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆప్తులు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మాగంటి కుటుంబ సభ్యులతో కలిసి దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, నేతలు రావుల శ్రీధర్ రెడ్డి, మైనార్టీ నేత సోహైల్, కార్పొరేటర్లు దేదీప్య రావు, వెల్దండ వెంకటేష్, డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.