జనహర్నగర్, ఆగస్టు 10 : రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. జపాన్ దేశంలో ఎలాంటి రిటైర్మెంట్ ఉండదో నాకు అలాంటిదే వర్తిస్తుందని, నేను రిటైర్మెంట్ తీసుకుంటానని అనలేదనని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. జనహర్నగర్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్ ప్రారంభోత్సవానికి ఆదివారం మల్లారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతటా విద్యాసంస్థలను నెలకొల్పి యువతకు నాణ్యమైన విద్యనందిస్తానని, బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు పోతానని చెప్పలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు.
జనహర్నగర్ నాకు గుండెకాయలాంటిదని, పేద ప్రజలు నివసించే ప్రాంతానికి జీవో 68, 69 ద్వారా ఇళ్లను క్రమబద్ధీకరించి యాజమాన్య హక్కులు కల్పించామని పేర్కొన్నారు. డంపింగ్ దుర్వాసను వెదజల్లకుండా రూ.144కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాపింగ్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నలుదిక్కులా మినీ డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని చేయకపోవడం దారుణమన్నారు.
జనహర్నగర్ ప్రధాన రహదారి అబిడ్స్ మోడల్‌ను తలపిస్తుందని, రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని మిషన్ భగీరథతో రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జనహర్నగర్ అభివృద్ధికి అండగా ఉంటానని, ప్రజలకు సేవ చేయడంలోనే తృప్తి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మేకల కావ్య, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనహర్నగర్ అధ్యక్షుడు సుధాకరాచారి, నాయకులు రాజశేఖర్, మహేశ్, ఎల్లస్వామి, సాధక్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.