వెంగళరావునగర్, నవంబర్ 29: ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ డివిజన్లోని శ్రీనగర్ కాలనీ, శాలీవాహన నగర్ కాలనీలో రూ.16 లక్షలతో చేపట్టిన వరద నీటి కాలువ మరమ్మతు పనులు పూర్తవడంతో కార్పొరేట్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి పేదలను ఆదుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ నియోజవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..గతంలో వరదలు వచ్చిన సమయంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవని, వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించేందుకు వరద కాలువ మరమ్మతుల పనులను పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి మధుయాదవ్,నాయకులు తన్ను ఖాన్,శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీవరేజీ లైన్ పనులకు శంకుస్థాపన
షేక్‌పేట్ నవంబర్ 29: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం షేక్‌పేట్ డివిజన్ సబ్జా కాలనీలో రూ. 4లక్షల 50 వేలతో నిర్మించనున్న సీవరేజీ లైన్ నిర్మాణ పనులను జలమండలి జీఎం మాణిక్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి జీఎం మాణిక్యం, డీజీఎం జవహర్ అలీ, మేనేజర్ మురళీధర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, సజ్జాద్ హుస్సేన్, రఫియా, మధు తదితరులు పాల్గొన్నారు.