జూబ్లీహిల్స్, డిసెంబర్16 : సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం యూసుఫ్‌గూడలో తెలుగు సినీ, టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొవిడ్ సమయంలో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ విపత్కర సమయంలో సీఎం కేసీఆర్ సినీ కార్మికులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం అధ్యక్షుడు బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులను కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి అభినందించారు. కార్యక్రమంలో నూతన ఉపాధ్యక్షులు రాజు, ఆనంద్, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావు, కొండా రావు, సతీశ్ కుమార్, కోశాధికారి ప్రసాద్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.