బొల్లారం, డిసెంబర్ 28 : కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే లాస్యనందిత పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందిచడమే లక్ష్యమన్నారు. గురువారం కంటోన్మెంట్ ఏడో వార్డు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఆర్టీసీ, బంజారానగర్, ఐఓబీ, రవి కాలనీల్లో స్పీడ్ బ్రేకర్లు, విద్యుత్ స్తంభాలు, సోలార్ లైట్లును ప్రారంభించి స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీల్లో సమస్యలన్నింటినీ బోర్డు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి ఏడో వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే లాస్య నందితకు కాలనీవాసులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పలు కాలనీల అధ్యక్షులు, మహిళలు శాలువాతో సన్మానించి శుభా కాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీశ్యామ్ కుమార్, బంజారా కాలనీ అధ్యక్షుడు అస్లాం, వైవీ రావు, ప్రసాద్, గోపిచంద్, కేశవ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు తేజ్పాల్, శత్రుఘ్ఞ మధు, శేఖర్, రాజిరెడ్డి, యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.