హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకులు రైతుల పాలిట మిడతల దండులా మారారని, పర్యటనల పేరుతో రైతుల కల్లాలపై దాడులు చేస్తున్నారని పీయూసీ చైర్మన్ ఏ జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించిన తరువాతే బీజేపీ నాయకులు ధాన్యం కేంద్రాల వద్దకు రావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర బీజేపీ నేతలు దొంగ నాటకాలు కట్టిపెట్టి, ఢిల్లీలో ప్రధాని మోదీ ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కోసం కేంద్రాన్ని ఒప్పిస్తే పూలవాన కురిపిస్తామని, కేంద్రం వడ్లు కొనకపోతే రాళ్ల వర్షం తప్పదని హెచ్చరించారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగా రైతులపై దాడులు చేస్తామంటే సహించేది లేదని తేల్చిచెప్పారు. రైతుల సహనాన్ని పరీక్షిస్తే బట్టలూడదీసి కొట్టే రోజు ఎంతోదూరంలో లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పంజాబ్‌లో మాదిరిగా ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని అడిగిన రైతులపై బండి సంజయ్ ముఠా దాడులకు దిగిందని ఆరోపించారు. సంజయ్ గూండా అవతారం ఎత్తారని మండిపడ్డారు. నల్లగొండలో బీజేపీ నేతలపై రైతులే తిరగబడ్డారని, అందులో టీఆర్ఎస్ కార్యకర్తలు లేరని చెప్పారు. రైతులపై దాడులు చేసిన బీజేపీ నేతలే గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. బురద జల్లే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ బందిపోట్ల ముఠా నాయకుడి మాదిరిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.