హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ):రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మొదలైన లొల్లి.. ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒంటెత్తుపోకడలతో విసిగిపోయిన వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి ఇక గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇతర పార్టీల్లో చేరకుండా స్వతంత్రంగానే ఉంటూ కాంగ్రెస్‌లోని కోవర్టులపై పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారని అనుచరులు చెప్తున్నారు. దీనిపై ఆయన శనివారం ముఖ్య అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్టు సమాచారం. ఆ వెంటనే రాజీనామా చేయడంతోపాటు, జరిగిన పరిణామాలపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు రాసిన లేఖను విడుదల చేయనున్నట్టు తెలిసింది.
రేవంత్ ఒంటెత్తు పోకడ..
టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైనప్పటి నుంచి రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడ పోతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు బాహాటంగా తమ అసహనాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. వారిలో ముఖ్యుడు జగ్గారెడ్డి. దీంతో పార్టీలో రేవంత్‌రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి అన్నంతగా పరిస్థితులు మారిపోయాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడంపైనే జగ్గారెడ్డి తొలుత అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ వల్ల ఒనగూరేదేమీ లేదని, అందరినీ కలుపుకొనిపోయేవాడు కాదని పార్టీ అధినేత్రికి ఫిర్యాదు చేశారు.
అప్పటినుంచి వారి మధ్య మొదలైన వివాదం ఆ తరువాత సద్దుమణిగినట్టు కనిపించినా ఎప్పటికప్పుడు రగులుకుంటూనే ఉన్నది. తనకు సమాచారం ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో పర్యటించడంపై జగ్గారెడ్డి మీడియా ముఖంగానే నిప్పులు చెరిగారు. రేవంత్‌ను పీకేసి మరొకరిని పీసీసీ చీఫ్ చేయాలని అధిష్ఠానాన్ని కోరారు. ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహించాలని రేవంత్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో కూడా విభేదించారు. సీనియర్లు నచ్చజెప్పడంతో కాస్త చల్లబడ్డారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం, తాను ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతునివ్వకపోవడం, హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా బీజేపీకి పరోక్షంగా మద్దతునివ్వడంపై జగ్గారెడ్డి ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు.
మరోవైపు రేవంత్ అనుచరులు సైతం జగ్గారెడ్డిని సామాజిక మాధ్యమాల వేదికగా వేధింపులకు గురిచేశారు. టీఆర్ఎస్ కోవర్టని, త్వరలో ఆ పార్టీలో చేరతాడని, అందుకే రేవంత్‌పై పదేపదే విమర్శలు చేస్తున్నాడని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి తిరుగుబాటుకు సిద్ధమయ్యారని సన్నిహితులు చెప్తున్నారు. తన ఫిర్యాదులను పార్టీ హైకమాండ్ పట్టించుకోకపోవడం, మరోవైపు రేవంత్ అనుచరుల దుష్ప్రచారంతో విసిగిపోయిన జగ్గారెడ్డి ఏకంగా పార్టీకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఏ పార్టీలోనూ చేరకుండా స్వతంత్రంగా ఉంటూ, రాజకీయ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. జగ్గారెడ్డి బాటలోనే మరికొందరు కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిసింది.