ఎల్బీనగర్, డిసెంబర్ 23: హైదరాబాద్ మహా నగరంలో మరొకచోట పర్యాటక సొబగులు అద్దుకున్నాయి. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో బోటు షికారు ప్రారంభమైంది. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్, ఇందిరా ప్రియదర్శినీ పార్కును సందర్శించే ప్రజలకు చెరువులో విహరించే అవకాశం కల్పిస్తూ టూరిజం విభాగం వారు బోటు షికారును ప్రారంభించారు. అందులో భాగంగా గురువారం ఉదయం సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో బోటును రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్త, టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణలతో కలిసి బోటును ప్రారంభించారు.
అనంతరం, సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో విహరించారు. సరూర్‌నగర్ చెరువుకు పర్యాటక సొబగులు అద్దే క్రమంలో బోటు షికారును ప్రారంభించినట్లుగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి అన్ని విధాలుగా అందుబాటులోకి తెస్తామన్నా రు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, ఆకుల శ్రీవాణి, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, భవాని ప్రవీణ్, కొప్పుల విఠల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, పీచర వెంకటేశ్వర్ రావు, ప్రేంనాథ్ గౌడ్, రమేష్ ముదిరాజ్, కృష్ణమాచారి, పార్శపు శ్రీధర్, డివిజన్ల అధ్యక్షులు జక్కల శ్రీశైలం యాదవ్, వరప్రసాద్ రెడ్డి, రాజిరెడ్డితో పాటుగా అడాల రమేష్, చేగోని సుదర్శన్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, జక్కిరి రఘువీర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, టూరిజం విభాగం అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి రావడంతో పాటు పోచంపల్లి ప్రపంచంలోనే బెస్ట్ విలేజ్‌గా ఎంపికైందని, హైదరాబాద్ నగరంతో పాటు కొండ పోచమ్మ సాగర్, యాదాద్రి దేవాలయాన్ని పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దుతున్నామన్నారు.