ఎల్బీనగర్, డిసెంబర్ 21: తెలంగాణ సీఎం కేసీఆర్ కల్పించిన ఉచిత మంచినీటి పథకం అమలు కోసం వినియోగదారులు విధిగా తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 31వ తేదీలోపు అందరూ 20 లీటర్ల ఉచిత తాగునీటి పథకం కోసం ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఉచిత నీటి సరఫరాను పొందాలంటే తప్పనిసరిగా జలమండలి నిబంధనలు పాటిస్తూ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు. వివరాలకు 15513 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో వేప చెట్లను రక్షించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు సొంత నిధులతో వెయ్యి చెట్లకు మందులను చల్లించినట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆధ్యాత్మికంగా వేప, రాగి చెట్లకు అనుబంధం ఉన్నదని, జీహెచ్ఎంసీ పరిధిలో వేపచెట్లకు తెగులు పట్టి ఎండిపోతున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రత్యేకంగా వేప చెట్లను కాపాడే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసుకుని వేప చెట్లను రక్షించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వెయ్యి చెట్లకు మందులు పిచికారీ చేశామని, నెలరోజుల్లో మరో నాలుగు వేల వేప చెట్లకు మందులను చల్లిస్తామన్నారు.