మన్సూరాబాద్, డిసెంబర్ 5: నేరాల నియంత్రణకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 70 కాలనీల్లో సుమారు రూ.10కోట్ల వ్యయంతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి తూర్పు విభాగంలోని పద్దెనిమిది కాలనీల సమస్యలపై సదరు కాలనీల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పవనగిరికాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి హాజరయ్యారు. కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే, కార్పొరేటర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో మహిళలు, యువతులతో పాటు ప్రజల్లో భరోసా పెరుగుతుందని తెలిపారు. శివారు కాలనీల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఇప్పటికే ట్రంకులైన్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్గత డ్రైనేజీని త్వరలో ట్రంకులైన్కు అనుసంధానం చేసి కాలనీల్లో మురుగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిన తాగునీటి సరఫరా పనులను త్వరితగతిన పూర్తిచేస్తానని హామీనిచ్చారు. కాలనీ ఏర్పడిన సమయంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ఉన్న పార్కు స్థలాలు, క్రీడా స్థలాల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే కాలనీలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
వీరన్నగుట్టలోని శివాలయాన్ని రూ.8 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో శివాలయ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని.. త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తిచేసి వచ్చే సంవత్సరం మార్చిలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
రోజురోజుకూ కొత్త కాలనీలు విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్వాతిగార్డెన్ నుంచి బొమ్మలగుడి మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో రోడ్డు వెడల్పు చేపట్టాలని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కోరారు. కాలనీల్లో పార్కు స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాధవరెడ్డి, అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్‌రావు, ఉపాధ్యక్షులు రఘునాథ్, సాయిలుగౌడ్, ప్రశాంత్‌రెడ్డి, సత్యం, నాయకులు పాతూరి శ్రీధర్‌గౌడ్, యంజాల జగన్, కాసాని అశోక్‌యాదవ్, పారంద సాయి, తదితరులు పాల్గొన్నారు.
చంపాపేట, డిసెంబర్ 5: నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చంపాపేట డివిజన్ పరిధి న్యూ మారుతీనగర్ కాలనీ వాసులు తమ కాలనీకి పార్కు ఏర్పాటు చేయాలని, అలాగే కాలనీ సమస్యలు పరిష్కరించాలని టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి సమక్షంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తలారి సత్యప్రకాశ్, కాలనీ వాసులు డాక్టర్ భువనేశ్వర్ రావు, కృష్ణ, రిషి, తదితరులు పాల్గొన్నారు.