బంజారాహిల్స్,డిసెంబర్ 14: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల కోసం రూ.1.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో జీహెచ్ఎంసీ అధికారులు, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఇందిరానగర్‌లో సీసీ రోడ్ల కోసం రూ.24 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అదే విధంగా జవహర్‌నగర్‌లో కమ్యూనిటీహాల్‌కు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 78లోని పద్మాలయ అంబేద్కర్‌నగర్‌లో ఎమ్మెల్యే పర్యటించగా అక్కడ రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే దానం రోడ్డు నిర్మాణం కోసం రూ.34లక్షలు మంజూరు చేసినట్లు , టెండర్లు ఖరారయ్యాయన్నారు.ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్సింగ్నగర్ ప్రధాన రోడ్డును వీడీసీసీ రోడ్డుగా మారుస్తున్నామని దీనికోసం రూ.10లక్షలు , ఏబీఎన్ చౌరస్తానుంచి గౌతమ్‌నగర్ చౌరస్తాదాకా పాడైన రోడ్డు స్థానం లో రూ.13.5లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎంసీ ఇస్లావత్ సేవా నాయక్, ఈఈ విజయ్‌కుమార్, డీఈ హరేరామ్, ఏఈ వెంకటేష్, జలమండలి జీఎం హరిశంకర్, వీధి దీపాల ఏఈ కిరణ్మయి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.