శేరిలింగంపల్లి, డిసెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాయదుర్గం-టౌలిచౌకి ఫ్లై ఓవర్ నెలాఖరులో ప్రజలకు అందుబాటులోకి రానున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి అన్నారు. గురువారం నియోజకవర్గం పరిధిలోని రాయదుర్గం టౌలిచౌకి ఫ్లైఓవర్ నిర్మాణ తుది దశ పనులను ఆయన స్థానిక మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రద్దీ ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్ల చుట్టపక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్ధం మెరుగైన రవాణ సౌకర్యాలను కల్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు కృషి చేస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలోనే రాయదుర్గం టోలిచౌకి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రూ. 333.35 కోట్ల వ్యయంతో 2.71 కిలోమీటర్ల విస్తీర్ణంతో దీనిని ప్రత్యేకంగా నిర్మించామని ఈ నెలాఖరులో అందుబాటులోకి రానున్నదని తెలిపారు. రాయదుర్గం మల్కంచెరువు నుంచి టోలిచౌకి వరకు దీనిని నిర్మించడం జరిగిందన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ట్రాఫిక్ రహిత ప్రయాణం కోసం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఐటీ రంగానికి వేదికైందని, ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థలు, పెద్ద పెద్ద భవనాలు ఈప్రాంతంలో వెలిశాయని అన్నారు. వీటంన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక బద్దమైన అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో అనేకహాహాదారుల అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్‌తో పాటు పలువురు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.