మియాపూర్, డిసెంబరు 15 : నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌ను అభివృద్ధి పరచటమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో రూ. 96 లక్షలతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణ పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, మాధవరం రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి విప్ అరెకపూడి గాంధీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీరు, డ్రైనేజీ, సౌకర్యవంతమైన రహదారులు, సమర్థమైన మురుగు నీటి వ్యవస్థలే అతి ముఖ్యమని, అన్ని ప్రాంతాలలో సమాన స్థాయిలో వీటిని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలకు సౌకర్యమే తమ అంతిమ లక్ష్యమని, కాలనీలో చేపట్టాల్సిన పనులపై ఎప్పటికపుడు ప్రజలతో పాటు అధికారులతోనూ చర్చిస్తూ తగిన ప్రతిపాదనలతో పనులలో ముందుకు సాగుతున్నామన్నారు. మౌలిక వసతులపరంగా నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన ధ్యేయమని విప్ గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి నిర్మాణ పనులలో నాణ్యతకు ప్రాధాన్యతను ఇవ్వాలని, అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ పనులు సకాలంలో పూర్తి చేయించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సమ్మారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్, కాశీనాథ్, రాజేశ్, మోజెస్, బస్తీ నేతలు స్వరూప, మున్నా, ఖాజా, సాలయ్య, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.