శేరిలింగంపల్లి, డిసెంబర్ 12: నలగండ్ల హుడా కాలనీలో మంజీరా పైపులైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నలగండ్ల హుడా కాలనీలో నూతనంగా నిర్మించనున్న మంజీరా పైపులైన్ల నిర్మాణ పనులపై జలమండలి డీజీఎం ఉమాపతి, నలగండ్ల హుడాకాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంత్రిప్రగడ సత్యనారాయణతో కలిసి ఆయన ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుడా కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన మంజీరా పైపులైన్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కాలనీల్లో ఇంటింటికీ మంజీరా నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించి వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరికి తాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ కళల ప్రాజెక్టు మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించేందుకు కృషి చేయాలన్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రతి ఇంటికీ 20,000 లీటర్ల నీటిని ఉచితంగా అందించే తాగునీటి పథకం ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జలమండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.