MK Stalin : తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం దగ్గరపడటంతో ప్రచారం జోరందుకుంది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. బుధవారం బీజేపీ (BJP) లక్ష్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh), మణిపుర్ (Manipur) రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడులోనూ అల్లర్లు సృష్టించేందుకు కమలం పార్టీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుచ్చిలో జరిగిన బహిరంగసభలో స్టాలిన్ మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపించే ఘర్షణలు, మూక దాడులు తమిళనాడులో ఇప్పటివరకు లేవని అన్నారు. ఈ సందర్భంగా యూపీ, మణిపుర్ పేర్లను ఆయన ప్రస్తావించారు. ఆ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి హింసాత్మక పరిస్థితులను సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
కానీ తమ పార్టీ ఆ కుట్రను భగ్నం చేసిందన్నారు స్టాలిన్. ఇక రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు తమకు నచ్చిన గృహోపకరణాలు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా రూ.8 వేల కూపన్ను అందిస్తామన్నారు. అదేవిధంగా ప్రతినెలా మహిళలకు రూ.2 వేల ఆర్థికసాయం అందిస్తామని, కాలేజీ విద్యార్థులకు రూ.1,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.