Miss Universe : థాయ్‌లాండ్ (Thailand) లో 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్లింది. ఈ వివాదం మొత్తం ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ కావడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న మిస్ మెక్సికో ఫాతిమా బోష్ ఒక షూట్‌కు హాజరుకాలేదు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్.. ఆమె గైర్హాజరుపై ప్రశ్నించారు. తెలివితక్కువ మనిషి అనే అర్థం వచ్చేలా ఆమెను నిందించారు. దాంతో ఆమె ఎదురుతిరిగారు.
‘మీరు మమ్మల్ని గౌరవించినట్లే మేం మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి’ అని తీవ్రంగా స్పందించారు. ‘ముందుగా నా మాట విని, ఆ తర్వాత వాదించండి’ అంటూ నవాత్ బదులిచ్చారు. ఆ విధంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం ఫాతిమాతోపాటు మరికొన్ని దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వేదిక నుంచి వాకౌట్ చేశారు. తర్వాత ఆమె బయటకు వచ్చి తన అసహనాన్ని వెళ్లగక్కారు. ఈ వ్యవహారం ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. నవాత్‌పై విమర్శలు వ్యక్తం కావడంతో ఆ డైరెక్టర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీనిపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ కూడా స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.