Imran khan : పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army chief) అసీమ్ మునీర్ (Asim Munir) పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్.. పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా స్థిరత్వం లేని వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఎక్స్ వేదికగా ఈ ఆరోపణలు చేశారు.
మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని, అధికార దాహంతో కళ్లుమూసుకుపోయిన ఆయన దాని కోసం ఎంతకైనా తెగిస్తారని ఇమ్రాన్ ఖాన్ దుయ్యబట్టారు. నవంబర్ 26 మే 9న మురిడ్కే ఘటనలను ప్రస్తావిస్తూ.. ఇవి అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణలని విమర్శించారు. పోలీసులు, భద్రతాసిబ్బంది తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు.
నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేమని ఖాన్ అన్నారు. మహిళలపై ఇంతటి క్రూరత్వం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి అసీమ్ మునీర్ వేధిస్తున్నారని ఆరోపించారు. బానిసత్వంలో బతకడం కంటే మరణమే మేలని వ్యాఖ్యానించారు. అసిమ్ మునీర్ తనపై, తన భార్యపై అన్ని రకాల అన్యాయాలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఏ రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఇంతటి క్రూరత్వాన్ని ఎదుర్కోలేదని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఎన్ని చేసినా సరే తాను తలవంచను, లొంగిపోను అని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నా అని తేల్చి చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంతో సయోధ్యకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కీలుబొమ్మ ప్రభుత్వంతోగానీ, సైనిక నాయకత్వంతోగానీ తమ పార్టీ చర్చలు జరపదని అన్నారు.