మక్తల్, ఫిబ్రవరి 12 : బీజేపీ నాయకులు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి హితవు పలికారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు ఎస్టీ రిజర్వుడు కాగా చందాపూర్‌కు చెందిన ఎరుకలి మహాదేవప్ప (44) బీజేపీ నుంచి పోటీలో నిలిచారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికకు ఒక రోజు ముందు అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులతోపాటు తనపై రుద్దడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
మహదేవప్పకు తాను ఎలాంటి ఫోన్లు చేయలేదని, అవసరమైతే కాల్ డేటా చెక్ చేసుకోవచ్చని బీజేపీ నాయకులకు సూచించారు. కాగా మహాదేవప్ప మృతిపై అతడి భార్య సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు పత్రం చర్చనీయాంశంగా మారింది. తన భర్త మహాదేవప్ప మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం వాస్తమేనని, చందాపూర్, తిర్లాపూర్ ప్రజలు ఓటు వేయరనే భయంతో మంగళవారం ఉదయం ఇంట్లో చీరతో ఉరేసుకొని చనిపోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.