హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): ‘ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి ఉత్తమ్ గారూ.. మీ ఉత్తమాటలు కట్టిపెట్టు. మీరు చెప్పే అబద్ధాలు నిజమైపోవు. అసంపూర్తిగా కాంగ్రెస్ పాలకులు వదిలేసిన ఆ ప్రాజెక్టును కేసీఆర్ హయాంలోనే పూర్తిచేశాం’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తేల్చి చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే నిర్మించామని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న గొప్పలన్నీ ఒట్టి మాటలేనని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
జలయజ్ఞంలో భాగంగా 2004 లో రూ.3,177 కోట్ల అంచనా వ్యయంతో ఎల్లంపల్లి ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాజెక్టుపై రూ.3,347.27 కోట్లు ఖర్చు చేసినా ప్రా జె క్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేద ని వెల్లడించారు. మొత్తంగా 20.16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌లో తెలంగాణ ఏర్పడే నాటికి ఏనాడూ 5 టీఎంసీలకు మించి నీటిని కూడా నిల్వ చేయలేదని విమర్శించారు. ‘భూసేకరణ పూర్తి చేయలేదు. ముంపు బాధితులకు పునరావాసం కల్పించలేదు. అవసరమైన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయని తదితర కారణాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు’ అని వివరించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మరో రూ.2,052.73 కోట్లను ఖర్చు చేసి ప్రాణహిత ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసిందని, 2016లో బరాజ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చిందని వీ శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి.. ఎల్లంపల్లి తామే కట్టినమని కాంగ్రెస్ పాలకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టు కోసం 2007లో రూ.17,875 కోట్లతో జీవో ఇచ్చి, కేవలం 19 నెలల్లోనే ఎలాంటి గణనీయమైన పని చేయకుండానే అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లకు నాటి కాంగ్రెస్ పాలకులు పెంచారని విమర్శించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే నాటికి అంచనా వ్యయం రూ.40,300 కోట్లకు చేరిందని తెలిపారు.