హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని, బాధ్యతారాహిత్యమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. దమ్ముం టే ఈ పథకాన్ని దేశమంతా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా పెట్టుకున్నదని గాలి తీశారు. సోమవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గొర్రెల పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు.
మొదటి విడత గొర్రెల పంపిణీ కోసం నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,549.98 కోట్లు రుణంగా తెచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసలు కింద 1,723.62 కోట్లు, వడ్డీ కింద రూ.1,177.12 కోట్లు మొత్తంగా రూ.2,900.74 ఎన్సీడీసీకి తిరిగి చెల్లించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పినప్పటికీ, ఇవ్వలేదని స్పష్టంచేశారు. సకాలంలో రుణాలు చెల్లించడంతో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఎన్సీడీసీ మరో రూ.4,593.75 కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. అయితే, కేంద్రం ఎటువంటి సబ్సిడీ ఇవ్వదనే విషయాన్ని ఎన్సీడీసీ కరాఖండిగా చెప్పిందని వెల్లడించారు.