సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్లు ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ క్రిస్మస్ను ఎంతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వపరంగా 10 వేల మందితో ఎల్బీ స్టేడియంలో విందు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పేద క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని రెండు, మూడు రోజులలో పూర్తి చేయాలని కోరారు. సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా క్రిస్టియన్లు ఉన్నారన్నారు. ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ విందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.