
హైదరాబాద్, జనవరి 26 : రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, బీఫాంతోపాటు సమర్పించే అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకొంటారని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లో తాను అన్ని వివరాలు పొందుపర్చానని చెప్పారు. చలానా పైసలు కట్టలేదని అనర్హత వేటువేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధాని ఎవరూ మిగలరని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారు కోర్టుల్లో కేసులు వేశారని, గత డిసెంబర్లోనే కోర్టు ఆ పిటిషన్‌ను కోట్టివేసిందని మంత్రి గుర్తుచేశారు. తనపై తప్పుడు ప్రచారం వెనుక ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఉన్నారని, తగిన సమయంలో వారి పేర్లను ఆధారాలతో సహా బయటపెడుతానని మంత్రి చెప్పారు.
బీసీ మంత్రులను టార్గెట్ చేయడం తగదు
రాజకీయ స్వప్రయోజనాల కోసం కొందరు అగ్రకులాల నేతలు బీసీ మంత్రులే లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, అది ఎంతమాత్రం తగదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ఇకనైనా ఆరోపణలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.