
హైదరాబాద్ ఆట ప్రతినిధి, డిసెంబర్ 12 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తెలంగాణలో రూపొందిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడలు యువజన సర్వీసులు, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో నిర్వహించిన హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్ అండ్ రిలే అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాలకు క్రీడల్లో బంగారు భవిష్యత్ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల చిన్నారులను సైతం జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బికాశ్ కారర్, ఒలంపియన్ శోభ పాల్గొన్నారు.