హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు మారాలని, లేదంటే రాబోయే రోజుల్లో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుత కృత్రిమ మేధ(ఏఐ) యుగంలోనూ పాత ఆలోచనలతో సంప్రదాయబద్ధంగా ముందుకెళ్తే తప్పా మనగడే ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు ఈ విషయంలో అప్రమత్తంగా, ప్రజలు కోరుకుంటున్న విధంగా కొత్తగా ఆలోచించాలని ఆయన సూచించారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘సమ్మిట్ ఆన్ ఫ్యూచర్-రెడీ ఇండస్ట్రీ ట్రాన్సఫర్మేషన్: ఇన్నోవేటింగ్ ఫర్ గ్రోథ్ ఎఫిషీయన్సీ అండ్ సెక్యూరిటీ(గ్రోథ్ ఎక్స్2025)’ సదస్సును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నదని, ముఖ్యంగా ఏఐ అందుబాటులోకి రావడంతో అన్ని రంగాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి..అలాగే అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన తీరు మారాలని ఆయన పేర్కొన్నారు. సమాజం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లకు ఏఐ, క్వాంటమ్, మెషిన్ లెర్నింగ్ తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను చూపొంచవచ్చని, ఆ దిశగా ఆవిష్కర్తలు కొత్తగా ఆలోచించాలని కోరారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిషర్తలు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నదని, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధి రేటు 17.98 శాతం కాగా జాతీయ సగటు 8 శాతం మాత్రమేనని, ఐటీ రంగంలో తెలంగాణ సత్తా ఏంటో చెప్పడానికి ఇదే నిదర్శనమని మంత్రి అన్నారు.
6 నుంచి చర్లపల్లిలో ఎంఎస్ఎంఈ ఎక్స్పో
ఈ నెల 6 నుంచి 8 వరకు చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఎక్స్పో-2025 ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో 106 స్టాల్స్‌ను నెలకొల్పుతున్నట్లు, వాటిలో వివిధ పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తులను, సేవలను ప్రదర్శించనున్నట్లు వారు చెప్పారు.