హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మహిళల భద్రత, రక్షణకు త్వరలో ప్రత్యేక వాట్సాప్ నంబర్ ద్వారా ఆన్లైన్ సేవలు అందించనున్నట్టు రాష్ట్ర మహిళాకమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ బుద్ధ్దభవన్లో రాష్ట్ర మహిళా కమిషన్ తొలి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళల సమస్యల పరిషారంలో దేశంలో రాష్ట్ర కమిషన్ ముందంజలో ఉన్నదని చెప్పారు. మాజీమంత్రిగా పనిచేసిన చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అనుభవం కమిషన్‌కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. మహిళలకు యూనివర్సిటీ ఉండాలని మంత్రివర్గ సమావేశంలో సూచించగానే, సీఎం కేసీఆర్ వెంటనే ఆమోదం తెలిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించటం మహిళలకు గొప్ప వరమని పేర్కొన్నారు.
కమిషన్ వార్షికోత్సవం సందర్భంగా వార్షిక నివేదిక విడుదల చేసి, మహిళలపై రూపొందించిన పాట సీడీని మంత్రి ఆవిషరించారు. సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం మహిళాభ్యుదయానికి ముందడుగు అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. కమిషన్ ఏర్పాటైన సంవత్సరకాలంలో 409 ఫిర్యాదులు రాగా వాటిలో 70 శాతం కేసులు పరిషరించామని తెలిపారు. 11 జిల్లాలను ఒక యూనిట్‌గా చేసి లోకల్ కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో వాట్సాప్ నంబర్ కేటాయించి ఆన్లైన్ ద్వారా కమిషన్ సేవలను మరింత విసృ్తతం చేస్తామని వివరించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరి భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతిరావు తదితరులు పాల్గొన్నారు.